వరంగల్ పేరు చెప్పగానే కాకతీయులు కాలం నాటి పురాతన దేవాలయాలు.. భద్రకాళి అమ్మవారు గుర్తుకు వస్తారు. గంభీర రూపంతో దర్శనం ఇచ్చే భద్రకాళి అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు కరువు కాటకాలు దరిచేరవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భారతదేశంలోని పురాతన దేవాలయాలలో వరంగల్ భద్రకాళి ఆలయం ఒకటి. భద్రకాళి వరంగల్, హన్మకొండ నగరాల మధ్య సరస్సు పక్కన ఉన్న కొండపై ఉంది. ఇది చాణుక్యుల పాలనలో క్రీ.శ. 625లో నిర్మించిన పురాతన దేవాలయం. ఈ ఆలయం అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటిగా చెప్పబడుతుంది. అయితే ఈ ఆలయాన్ని దక్షిణ భారత స్వర్ణదేవాలయం అని అంటారు కూడా. ఇంత మహిమాన్వితమైన ఆలయ విశిష్టత, స్థలపురాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
చారిత్రక,మతపరమైన ప్రాముఖ్యతతోపాటు, ఆలయం చుట్టూ ఉన్న సహజ రాతి నిర్మాణాలు కన్నుల పండువగా ఉంటాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత భద్రకాళి కూర్చున్న భంగిమలో ఉంటుంది. భద్రకాళి అమ్మవారి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తుంది. 8 చేతులతో కొలవైన అమ్మవారి కుడివైపు ఉన్న 4 చేతులతో ఖడ్గము, ఛురిక, జపమాల, ఢమరుము, ఎడమవైపు 4 చేతులతో ఘంట, త్రిశూలము, ఛిన్న మస్తకము, పానపాత్రలు ఉన్నాయి. అమ్మవారు పశ్చిమాభిముఖంగా కొలువై ప్రతినిత్యము జరిగే ధూపదీప నైవేద్యాలతోపాటు ప్రతి సంవత్సరమూ ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు, చైత్ర మానంలో వసంత రాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఆషాడమాసంలో పౌర్ణమి నాడు అమ్మవారిని ‘శాకంభరి’గా అలంకరిస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు.
దేవాలయ గర్భగుడి ఎదురుగా సింహం విగ్రహం ఉంటుంది. ఆలయం లోపల ఇంకా చాలా మందిరాలు ఉన్నాయి. మహా మండపంలో, శివుడు, హనుమాన్ దేవాలయం, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాల కోసం ప్రత్యేక మందిరాలు ఉంటాయి.
ఓరుగల్లు ప్రజలకు ఇలువేల్పుగా నేటికి విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీమాత ఆలయము కాకతీయుల కాలం నాటికే ప్రాభవంలో ఉందన్న ఆధారాలు ఉన్నాయి. ప్రతాపరుద్ర చరిత్రలోను, సిద్దేశ్వర చరిత్రలోను, భద్రకాళీ అమ్మవారి గురించి ప్రస్తావించబడింది. భద్రకాళీ ఆలయము క్రీ.శ.625లోనే నిర్మింపబడిందని స్థానికుల అభిప్రాయం. వేంగీ చాళుక్యుల పైన విజయం సాధించడానికి, పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించి, అమ్మవారిని ఆరాధించినట్లు చెబుతారు. అందుకు ఆధారం అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండశిలమీద చెక్కబడి ఉండటమే. ఈ విధంగా ఏకాండ శిలలో విగ్రహం చెక్కడం చాళుక్య సంప్రదాయంలో కనిపిస్తుంది. భద్రకాళీ దేవాలయంలోని రెండు స్తంభశాసనాలను బట్టి ఈ దేవాలయం క్రీ.శ.10వ శతాబ్దంలో నిర్మింపబడి ఉంటుందని అంచనావేస్తున్నారు.
భద్రకాళీ ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా ప్రసిద్ధి గాంచింది. చాళుక్యుల కాలం నాటి నిర్మాణ శైలి సందర్శకులను అబ్బురపరుస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ఆలయం బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. అందుకే భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా పిలుస్తారు. ఈ ఆలయానికి పక్కన ఉండే భద్రకాళి సరస్సును భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. 1950 నాటికే శ్రీ అమ్మవారి శక్తులను గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉండేవి. అమ్మవారి గుడిలో విగ్రహం క్రింద ధనరాశులు ఉంటాయనే సమ్మకంతో,అర్ధరాత్రివేళ త్రవ్వి ధనాన్ని దొంగిలించాలని ప్రయత్నించిన ఒక వ్యక్తి కొంత దూరం వెళ్ళగానే రక్తం కక్కుకొని చనిపోయినట్లు నేటికి స్ధానికంగా చెప్పుకుంటుంటారు.
భద్రకాళి ఆలయం వరంగల్ చుట్టూ, సందర్శించదగిన అనేక ఇతర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటిలో కొన్ని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం, పద్మాక్షి ఆలయం, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం, శ్రీ నరసింహ స్వామి ఆలయం మొదలైనవి. వరంగల్‌లోని మరొక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ, వెయ్యి స్తంభాల ఆలయం భద్రకాళి ఆలయానికి 2 కి.మీ దూరంలో ఉంది. రెండు ప్రదేశాల సందర్శనను కలిపి క్లబ్బు చేయవచ్చు.
భద్రకాళి ఆలయ నిర్మాణం మరియు చరిత్ర, వరంగల్ చాళుక్యుల నిర్మాణ శైలిలో నిర్మించబడిన భద్రకాళి దేవాలయం వేంగి ప్రాంతాన్ని వారు స్వాధీనం చేసుకున్నందుకు గుర్తుగా నిర్మించబడిన పురాతన దేవాలయం. ఆలయంలోని ఏకాంద శిలా విగ్రహం, స్తంభాలపై ఉన్న క్లిష్టమైన శిల్పాలు కాకతీయ పాలన యొక్క అద్భుతమైన హస్తకళను సూచిస్తాయి.
కాకతీయ రాజులు కూడా భద్రకాళి దేవిని తమ పితృదేవతగా భావించారు కాబట్టి ఆలయానికి కూడా సహకారం అందించారు. కాకతీయుల హయాంలో భద్రకాళి సరస్సును నిర్మించారు. వారి పాలనలో ఆలయాన్ని కలుపుతూ ఒక సరస్సు కూడా నిర్మించబడింది. అయితే కాకతీయుల పాలన పతనంతో వరంగల్ భద్రకాళి ఆలయానికి ప్రాధాన్యత తగ్గింది.
అనేక దశాబ్దాల తర్వాత, 1950లలో భద్రకాళి ఆలయం మళ్లీ పునరుద్ధరించబడింది. 1940లలో కర్ణాటక నుండి వరంగల్‌కు వలస వచ్చిన కాళీమాత యొక్క అమిత భక్తుడైన శ్రీ గణపతి శాస్త్రి దీనిని ప్రారంభించారు. భద్రకాళి ఆలయ అవశేషాలను చూసిన తరువాత, అతను కేవలం ఏకాంత ప్రాంతంగా ఉన్న ఆలయం పక్కనే స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. అతను శ్రీ ముడుంబై రామానుజాచార్య మరియు శ్రీ మగన్‌లాల్ సమేజా వంటి ఇతర స్థానికుల సహాయంతో ఆలయాన్ని పునరుద్ధరించే పనిని ప్రారంభించాడు. వంగాల గురవయ్య, బ్రహ్మశ్రీ శ్రీ హరి రాధాకృష్ణమూర్తి, తాండ్ర వెంకట రామ నర్సయ్య, అడ్లూరి సీతారామ శాస్త్రి, టంకసాల నరసింహారావు, మహా తపస్వినీ మంగళాంబిక వంటి అనేక మంది ఈ ఆలయ పునరుద్ధరణలో తమ వంతు సహకారం అందించారు.
ఈ భద్రకాళి ఆలయంలో పునర్నిర్మాణం తరువాత, జంతు బలులు నిలిపివేయబడ్డాయి. అంతేకాకుండా గుడి పునరుద్ధరణలో భాగంగా అమ్మవారి నాలుగుక పై అమృత భీజాలు రాసి భీకర ఆకారాన్ని ప్రసన్నంగా మార్చారు. దీంతో పాటు అమ్మవారి గుడిలో చంఢీయంత్రాన్ని ప్రతిష్ఠించారు. ఆషాడమాసంలో 15 రోజులపాటు అమ్మవారికి జరిగే ఉత్సవాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. దేవీ భాగవతం ప్రకారం అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహించే బ్రహ్మోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని సందర్శించేందుకు తరలివస్తారు.
ఆగస్ట్-సెప్టెంబర్ నెలలో శ్రావణ మాస సమయంలో, ఆలయంలో వసంత నవరాత్రి, శాకంబరీ ఉత్సవాలు, శరణ్ నవరాత్రి వంటి అనేక ప్రముఖ పండుగలు జరుపుకుంటారు. బతుకమ్మ పండుగను మహిళలు, బాలికలు అందంగా అమర్చిన పూల నమూనాలతో భద్రకాళి సరస్సును సందర్శించి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు.
ఈ రోజు మనం చూస్తున్న భద్రకాళీ ఆలయం గతంలో ఎన్నో దాడులను, దోపిడీలను, విధ్వంసాలను ఎదుర్కొంది. ఆలయ పునరుద్ధరణలో భాగంగా తన భీకర రూపాన్ని మార్చుకుని చిరునవ్వులతో భక్తులను అనుగ్రహిస్తోంది భద్రకాళీ అమ్మవారు. ప్రతినిత్యం భక్తుల రద్ధీతో ప్రత్యేక పూజలందుకుంటున్న అమ్మవారి అనుగ్రహం మాతో పాటు మీ పై కూడా ఉండాలని కోరుకుంటూ.. తిరిగి మరో ఆలయ గోపురంతో మీ ముందుకు వస్తాము..