Swamy Ayyappa

Swamy Ayyappa: శరణమయ్యప్పా అంటే చాలు.. భక్తులను కాచే స్వామి! శబరమలేశుని చరిత ఇదే !!

హరిహర సుతుడు అయ్యప్ప దీక్షా కాలం కార్తీకమాసంతోనే ప్రారంభమై.. మకరజ్యోతితో పూర్తవుతుంది. 18 కొండల మధ్యలోని శబరిగిరి శిఖరం పై స్వామి దర్శనం కోసం చేపట్టే భక్తులు 41 రోజులు కఠిన దీక్ష చేపడుతారు. ఇరుముడి కట్టు శబరిమలైకి.. అని అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములంతా ఇరుముడితో బయలుదేరుతారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉండే 18 మెట్లకు విశిష్టత ఉంది. ఆ 18 మెట్లను “పదునెట్టాంపడి” అని పిలుస్తారు. ఇంతకీ ఇరుముడి అంటే ఏంటి? స్వామి వారికి ఈ 18 బంగార మెట్లకు ఉన్న సంబంధమేంటి..? ఆ 18 మెట్ల వెనుక ఉన్న రహస్యాలేంటి..? ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకతలేంటనే ఆశక్తి కరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పురాణాల ప్రకారం, అయ్యప్ప స్వామి శబరిమలైలో నివాసం ఉండేందుకు నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అష్టదిగ్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారారు. 1) మహంకాళి 2) కళింకాళి 3) భైరవ, 4) సుబ్రహ్మణ్యం 5) గంధర్వరాజ 6) కార్తవీర్య 7) క్రిష్ణ పింగళ 8) భేతాళ 9) మహిషాసుర మర్దని 10) నాగరాజ 11) రేణుకా పరమేశ్వరి 12) హిడింబ 13) కర్ణ వైశాఖ 14) అన్నపూర్ణేశ్వరి, 15) పుళిందిని 16) స్వప్న వారాహి 17) ప్రత్యంగళి 18) నాగ యక్షిణి. ఈ ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగేస్తూ స్వామి వారు తన స్థానాన్ని అధిష్టించారు. అయితే ఈ 18 మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణులవుతారని చాలా మంది భక్తుల విశ్వాసం.

ఇకపోతే ఈ 18 మెట్లను గ్రానైట్‌తో నిర్మించారు. అంతేకాకుండా వాటికి పంచ లోహాలతో పూత పూశారు. తొలుత కుడి కాలు పెట్టి స్వామివారి 18 మెట్లను భక్తులు ఎక్కాల్సి ఉంటుంది. స్వామివారి సన్నిధానంలోని తొలి ఐదు మెట్లు మనిషి పంచేంద్రియాలతో సమానం. కళ్లు, చెవులు, ముక్కు, నాలుక, స్పర్శకు ఇవి ప్రతీకలుగా నిలుస్తాయి. తర్వాత 8 మెట్లు రాగద్వేషాలకు సంబంధించినవి. కామ, క్రోదం, మోహం, మద, మాత్సర్యం, అసూయ, డాంబికాలు పలకడం వంటి ఒక్కో దాన్ని ఒక్కో మెట్టు సూచిస్తుంది. తర్వాత మూడు మెట్లు త్రిగుణాలకు సంబంధించినవి. సత్వ, తమో, రజో గుణాలకు ఇవి ప్రతీకగా నిలుస్తాయి. ఇక చివరి రెండు మెట్లు విద్య, అవిద్య.. అంటే అజ్ఞానంను సూచిస్తాయి. ఎవరైతే ఈ 18 మెట్లను భక్తి భావంతో, గౌరవంతో ఎక్కి స్వామి వారిని దర్శించుకుంటారో వారు శారీరకంగా, మానసికంగా పరిపూర్ణుడవుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

మాలధారణం నియమాల తోరణం.. జన్మ తారణం దుష్కర్మ వారణం.. అంటే మన జన్మకు కారణం తెలుసుకుని.. నిష్కర్మలు నివారణ చేసుకోవాలి అని అర్థం. మండల దీక్ష పూర్తైన తర్వాత శబరిమలలో కొలువైన అయ్యప్ప దర్శనానికి ఇరుముడి కట్టుకుని బయల్దేరుతారు స్వాములు. ఇరుముడి అంటే రెండు ముడులు అని అర్థం. ఆ రెండూ భక్తి, శ్రద్ధకు ప్రతీక. ఇరుముడికి కట్టే తాడు ప్రణవం. భక్తి, శ్రద్ధలను సాధనతో పొందగలిగితే.. స్వామి అనుగ్రహం లభిస్తుందని అందులోని ఆంతర్యం. ఇరుముడి ఒక భాగంలో దేవుడికి సంబంధించిన సామగ్రి ఉంచుతారు. రెండో భాగంలో నీళ్లు తొలగించిన కొబ్బరికాయలో ఆవునెయ్యిని నింపి ఉంచుతారు. జీవాత్మ, పరమాత్మలను అనుసంధానం చేయడం ఇందులోని ఆంతర్యం. ఈ నేతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇరుముడితో శబరిమల ఆలయంలోని పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు. అయ్యప్పను కన్నులారా దర్శించుకుని పుణ్యక్షేత్రాల మీదుగా ఇంటికి చేరుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *