మహా గ్రూప్ తెలుగు ప్రజల కోసం ఆధ్యాత్మిక పరిమళాలను మోసుకు వస్తోంది. సనాతన ధర్మ వెలుగుల్ని ప్రపంచం నలుదిక్కులా వ్యాప్తి చేయడానికి మహా గ్రూప్ ఛైర్మన్, ఎండీ మారెళ్ల వంశీకృష్ణ ఆధ్వర్యంలో మహా భక్తి ఛానల్ అందుబాటులోకి వస్తోంది. ఆధ్యాత్మిక విషయాలు . . సనాతన ధర్మ సూక్ష్మాలు . . భక్తి ప్రవచనాలు . . ఒక్కటేమిటి మానవ జీవనంలో ఆధ్యాత్మిక ప్రయాణానికి అవసరమైన అన్ని విశేషాలను నిత్యం స్పృశించే ఛానల్ గా మహా భక్తి ప్రసారం కాబోతోంది. మహా శివరాత్రి పర్వదినం రోజున మహా భక్తి ఛానల్ ప్రసారాలు ప్రారంభం కానున్నాయి . ఈ ప్రారంభ సంబరాలను మహా జాగరణ ఉత్సవంతో అంగరంగ వైభవంగా జరిపించడానికి మహా గ్రూప్ సిద్ధం అయింది . అమరావతిలోని నంబూరు శ్రీ దశావతార ఆలయ ప్రాంగణంలో నభూతో నభవిష్యత్ అన్న చందంగా మహా భక్తి ఛానల్ నిర్వహించనున్న మహా జాగరణ కార్యక్రమానికి సర్వం సిద్ధం అయింది. ఫిబ్రవరి 26 సాయంత్రం 5 గంటల నుంచి ఫిబ్రవరి 27 ఉదయం 5 గంటల వరకూ తెలుగు ప్రజలకు మహాదేవుని జాగరణోత్సవం ఘనంగా జరుపబోతోంది మహా గ్రూప్. శ్రీశ్రీశ్రీ మహామండలేశ్వర్ కైలాసానంద గిరిజా మహారాజ్ ఆశీస్సులతో శివోహం పేరుతొ శివ జాగరణ మహోత్సవం జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి, నారా లోకేష్ బాబులు మహాభక్తి ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిథులుగా అలరించనున్నారు.

ఈ నేపథ్యంలో మహా భక్తి ఛానల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం ప్రతిపాదిత శివోహం వేదిక వద్ద వేడుకగా జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శివోహం వద్ద మహా భక్తి లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఉద్భవిస్తున్న ఛానల్ మహా భక్తి ఛానల్ అని చెప్పారు. సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం మహా వంశీ చేస్తున్న ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. మహా భక్తి ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక భవనాలను వ్యాప్తి చేయడమే కాకుండా.. హైందవ ధర్మానికి సంబంధించిన చరిత్రను అందరికీ తెలిసేలా చేయాలని చెప్పారు. మన విద్యావిధానంలో మన దేశాన్ని కొల్లగొట్టిన మొఘలుల గురించి.. బ్రిటీషర్ల గురించి చెప్పుకొస్తున్నారే తప్ప.. హైందవ ధర్మం మీద దాడులు జరుగుతున్న సమయంలో మన ధర్మాన్ని . . మన ఆలయాలను . . మన సంస్కృతిని కాపాడడం కోసం ప్రాణాలొడ్డిన వీరుల గురించి ప్రస్తావన తక్కువగా ఉందన్నారు . అటువంటి చరిత్రను మాహా భక్తి ఛానల్ ద్వారా ప్రజల ముందుకు తీసుకురావాలని మహా వంశీని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కోరారు . తానూ ఓట్ల కోసం వెంపర్లాడనని . . సనాతన ధర్మం , హైందవ ధర్మం పేరేదైనా మనకు ఈ జీవితాన్నిచ్చిన పరమాత్మ పై దాడి జరిగితే చూస్తూ ఊరుకోనని పవన్ కళ్యాణ్ చెప్పారు. సెక్యులరిజం పేరుతో మన ధర్మంపై దాడి చేస్తుంటే ఓట్ల కోసం మౌనంగా ఉండిపోవడం సరికాదన్నారు . అన్ని మతాలూ బావుండాలి అని కోరుకునే మనం మన ధర్మంపై దాడి జరుగుతుంటే మాట్లాడకుండా ఉండడం సరైనది కాదని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఈ సందర్భంగా మహా వంశీ మాట్లాడుతూ ఆ భగవంతుడు ఆదేశించాడు . . తాను దానిని పాటిస్తున్నాను అంటూ రెండే ముక్కల్లో మహా భక్తి ఛానల్ ఏర్పాటు చేయడానికి కారణాన్ని చెప్పారు. ధర్మ పరిరక్షణే ధ్యేయంగా . . సమాజంలో చైతన్యాన్ని తీసుకువచ్చే విధంగా . . ప్రజలకు ఆధ్యాత్మిక విశేషాలను అందించేందుకు మహా భక్తి ఛానల్ ప్రారంభిస్తున్నామని వెల్లడించారు .